ఇరాన్‌పై యుద్ధం: నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షులు!

  • ఇరాన్‌పై యుద్ధం కోసం నెతన్యాహు పలుమార్లు ప్రతిపాదించారన్న జాన్ కెర్రీ 
  • బుష్, ఒబామా, బైడెన్ వంటి అధ్యక్షులు తిరస్కరించారని వెల్లడి
  • డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం నెతన్యాహు ఒప్పించగలిగారన్న మాజీ మంత్రి
  • అమెరికా ప్రజలతో అబద్ధాలు చెప్పి యుద్ధానికి పంపవద్దని కెర్రీ హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఇరాన్‌తో యుద్ధం చేయాలంటూ గతంలో పలువురు అమెరికా అధ్యక్షులకు ప్రతిపాదించారని, అయితే వారంతా దానిని తిరస్కరించారని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

"ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్బర్ట్" కార్యక్రమంలో కెర్రీ మాట్లాడుతూ.. "మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్.. అందరూ నెతన్యాహు ప్రతిపాదనకు 'నో' చెప్పారు. ఆ చర్చల్లో నేను కూడా భాగస్వామిని" అని స్పష్టం చేశారు. శాంతియుత మార్గాలు ఇంకా అందుబాటులో ఉన్నందున వారు యుద్ధానికి అంగీకరించలేదని వివరించారు.

అయితే, డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం నెతన్యాహు ఒప్పించగలిగారని కెర్రీ తెలిపారు. ఇరాన్‌లో సులభంగా పాలన మార్పు వస్తుందని, ప్రజలే తిరగబడతారని నమ్మబలికినట్లు చెప్పారు. దీనికి ట్రంప్, "నాకు బాగానే అనిపిస్తోంది" అంటూ ఉమ్మడి ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఓ నివేదికను ఉటంకించారు. కానీ, నెతన్యాహు అంచనాలు తప్పాయని, అక్కడ అలాంటిదేమీ జరగలేదని అన్నారు.

ఇటీవల, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌పై నెతన్యాహు అంచనాల గురించి ఆయనతో ఫోన్‌లో వాదించినట్లు వార్తలు వచ్చాయి. వియత్నాం, ఇరాక్ యుద్ధాల అనుభవాలను గుర్తుచేస్తూ.. అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పి వారి పిల్లలను యుద్ధానికి పంపకూడదని కెర్రీ హితవు పలికారు.

Benjamin Netanyahu
Iran
Israel
US relations
John Kerry
Donald Trump
Joe Biden
Netanyahu Iran war proposal
US foreign policy
Middle East conflict

More Telugu News